శ్రీ కామాక్షీ సమేత ఏకామ్రేశ్వర స్వామి వారి దేవస్థానం,

గోకుల్ గార్డెన్స్, రాయుడుపాలెం,

కాకినాడ, 533 0005

Telugu Vedic Scriptures, Mahanyasam, Rudram

శ్రీ కామాక్షీ సమేత ఏకామ్రేశ్వర స్వామి వారి ఆలయం  శైవాగమ సిధ్ధాంతానుసారముగా  స్థానిక పెద్దల సహకారాలతో,  తమ స్వంత ఖర్చు తో, నిర్మించే అవకాశం చి: అక్కిన సోమేశ్వర సునీల్ - చి: సౌ: అక్కిన అనూష దంపతులకు తమ పూర్వజన్మ పుణ్య  ఫలంగా ఆ పరమేశ్వరుడు లభింపచేసాడు. ఈ ఆలయం కాకినాడ సరిహద్దుల్లో రమణయ్య పేట పంచాయతీ లో గల  గోకుల్ గార్డెన్స్ లో  నిర్మించబడింది (ఆలయానికి దారి).  ఈ ఆలయం లో స్వామివారు  సద్యోజాత (పశ్చమ) ముఖం గా కొలువైయున్నారు. సద్యోజాత శివాలయాలు అరుదు, అవి చాలా శక్తివంతమైనవని, భక్తుల ధార్మికమైన కోరికలు ఈ స్వామి దర్శనము వలన సులభంగా  నెరవేరుతాయని పెద్దల ఉవాచ.

స్వామి వారు వారణాసి నుంచి మధువర్ణ నర్మదా బాణలింగం గాను , కామాక్షీ  అమ్మవారు కంచి నుంచి  కామాక్షీ అమ్మవారి ఆలయం ప్రక్కనే ఉన్న శిల్పాలయం లో మలచబడి  ఇక్కడకు వేంచేశారు. వివిధ అంతరాలయ, పరివార దేవతలు కూడా కంచి నుంచే వేంచేశారు.

ఈ ప్రతిష్ఠ కార్యక్రమములు మార్చి 2, 2017 న మొదలై ఐదు రోజుల పాటు పంచాధివాసాలు, రుద్ర హోమము,  చండీ హోమము, మూల మంత్ర హోమములు, శ్రీ చక్రార్చన, చండీ సప్తశతి పారాయణం, శ్రీ రుద్ర పారాయణం, ప్రతిష్ఠిత సర్వ దేవతా జపములు మరియూ చతుర్వేద పారాయణములు,  గర్తన్యాసం, నవరత్న న్యాసం, నేత్రోన్మీలనం, గోవీక్షణం, కళాన్యాసం, అఖండ మహా పూర్ణాహుతి, శిఖర దివ్య ప్రతిష్ఠలు, శాంతి కళ్యాణం తో స్వస్తిశ్రీ దుర్ముఖి నామసంవత్సర ఫాల్గుణ శుద్ధ నవమి, సోమవారం మార్చి 06, 2017 ఉదయం 11-05 ని: ప్రతిష్ఠ కార్యక్రమములు సుసంపూర్ణం అయ్యాయి.

 

శ్రీ కామాక్షీ సమేత ఏకామ్రేశ్వర స్వామి వారి ఆలయం  లో  అయ్యవారు, అమ్మవారి తో పాటు , శ్రీ చండీశ్వరుడు;

అంతరాలయం లో  శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు,

 

ఉపాలయాలలో శ్రీ కాలభైరవ స్వామి, శ్రీ ఆదిశంకరాచార్య స్వామి వారలు.

స్వామివారి ఆలయ పరివార దేవతలుగా శ్రీ వైష్ణవీ దుర్గ, శ్రీ బ్రహ్మ, శ్రీ మహా విష్ణువు, శ్రీ దక్షిణామూర్తి, శ్రీ నిధన గణపతి.

అమ్మవారి ఆలయ పరివార దేవతలుగా శ్రీ బ్రాహ్మి, శ్రీ మాహేశ్వరి,  శ్రీ మహాలక్ష్మి వేంచేసియున్నారు..

 
 

ఆలయం నైరుతి దిశలో కాశీ నుంచి తీసుకురాబడ్డ  స్ఫటికలింగముల సమూహమును ప్రతిష్టించడం జరిగింది

ఇవి  మొత్తం 52 రిలింగాలు- త్రిలింగాలు (3), పంచభూతలింగాలు (5), పంచారామలింగాలు (5), ద్వాదశజ్యోతిర్లింగాలు (12), నక్షత్రమండలము (27).

ఈ లింగ సమూహాన్ని భక్తులందరూ స్వయంగా అభిషేకం చేసుకునే సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. 

ప్రతీ రోజు, ముఖ్యం గా పర్వదినాల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో అభిషేకం చేసుకుని ఈ అవకాశమును సద్వినియోగం  చేసుకుంటున్నారు.

 

44 అడుగుల పొడవుగల ఏకశిలా స్తంభాన్ని హుజూర్ నగర్ నుంచి తెప్పించి ఆలయ ప్రాంగణంలోనే ధ్వజస్తంభం గా మలచబడి స్వామి వారి అనుగ్రహము తో అక్టోబర్ 2017 లో ధ్వజస్తంభ ప్రతిష్ట  జరిగింది

ఆలయ ప్రాంగణం లో తూర్పు న ఒకే మామిడి చెట్టు నుండి నాలుగు రకాలు పండ్లు పండేవిధంగా  ఆలయ దేవతా వృక్షం పెంచబడుతోంది.  ప్రాంగణం లో మామిడి చెట్లు,  కొబ్బరి చెట్లు, రుద్రాక్ష, మోదుగ, మద్ది, రావి, వేప, ఉసిరిక, శమీ (జమ్మి), తులసి,జిల్లేడు, తుమ్మి, అరటి, చెరుకు, బిల్వ మరియూ వివిధ రకముల మందార మొక్కలు పెంచబడుతున్నాయి.

 

ఆలయ సమయాలు: ఉదయం 6: 00 గం - 11:00 గం మరియూ సాయంత్రం  6: 00 గం - 8:00  గం వరకు.

 

ఆలయంలో జరిగే కార్యక్రమ వివరాలు:

ఉదయం:   శ్రీ ఏకామ్రేశ్వర స్వామి వారికి ప్రతి రోజు లఘున్యాస పూర్వక ఏకవారాభిషేకం. ప్రతీ  సోమవారం, మాసశివరాత్రి , కార్తీకమాసం నెలంతా, మరియూ ఇతర పర్వదినాల్లో మహాన్యాస పూర్వక ఏకవారాభిషేకం/ఏకాదశ రుద్రాభిషేకములు,

తదనంతరము నీరాజన మంత్రపుష్పాలు సమర్పించబడుతున్నాయి.

ప్రతీ శుక్రవారం ఉదయం శ్రీ కామాక్షీ అమ్మవారికి కంచి కామకోటి పీఠంలో జరిగే అభిషేక ప్రక్రియానుసారంగా రుద్ర నమక చమకాలు, శ్రీ సూక్త, దుర్గ సూక్త, మేధా సూక్త పురుష సూక్తముల తో అభిషేకం, తదనంతరము నీరాజన మంత్రపుష్పాలు సమర్పించబడుతున్నాయి.

ప్రతీ శుక్రవారం సాయంత్రం శ్రీ ఆది శంకరాచార్య స్వామి వారికి  తోటకాష్టకం, శ్రీ స్వామి వారికీ శివాష్టోత్తరం అనంతరం శ్రీ కామాక్షీ అమ్మవారికి భక్తులచే సామూహిక లలితా సహస్ర నామ పారాయణం తదనంతరము నీరాజన మంత్రపుష్పాలు సమర్పించబడుతున్నాయి .

 

ప్రతీ పౌర్ణమి కి, శరన్వరాత్రి ఉత్సవాల్లో  ప్రతీ సాయంత్రం భక్తులచే లలితా సహస్ర నామపారాయణం తో పాటు సామూహిక కుంకుమార్చన జరుపబడుతున్నాయి.

 

ప్రతీ శుద్ధ పంచమి నాడు ఉదయం ఉపాలయ ప్రతిష్ఠిత ఆదిశంకరాచార్య స్వామి వారికి అభిషేకము. వైశాఖ శుద్ధ పంచమి శ్రీ జగద్గురు జయంతి సందర్భం గా  త్రిదివస ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి.

 

ప్రతీ శుద్ధ షష్టి నాడు ఉదయం అంతరాలయ ప్రతిష్ఠిత సుబ్రహ్మణ్యస్వామి వారికి అభిషేకము. మార్గశిర మాసంలో  సుబ్రహ్మణ్య షష్ఠి మహాపుణ్యదిన సందర్భముగా  స్వామి వారికి  ప్రత్యేకాభిషేకం /పూజ

ప్రతీ శుక్ల పక్ష అష్టమి నాడు ఉదయం ఉపాలయ ప్రతిష్ఠిత కాలభైరవ స్వామి వారికి అభిషేకము. మాఘ కృష్ణ పక్ష అష్టమి తిధికి శ్రీ కాలభైరావాష్టమి నాడు  స్వామి వారికి  ప్రత్యేకాభిషేకం /పూజ

ప్రతీ సంకష్టహర చతుర్థి నాడు ఉదయం అంతరాలయ ప్రతిష్ఠిత గణపతికి అభిషేకము.

 

ప్రతీ శుక్లపక్ష త్రయోదశి నాడు ప్రదోషసమయం లో శ్రీ నందీశ్వర స్వామి వారికి శ్రీ ఏకామ్రేశ్వర స్వామి వారికీ ఏక కాలం లో అభిషేకం జరుపబడుతూ వస్తుంది. ఈ ప్రత్యేకాభిషేకం తమిళనాడు, కర్ణాటకలలో విరివిగా జరుగుతూ ఉంటుందని  ఆంధ్రప్రదేశ్ లో  శివాలయములలో కూడా ఎక్కువగా జరుగాలని పండితుల/ ప్రవచన కర్తల విన్నపం.

 

గుకారశ్చంధకారస్తు రుకారస్తన్ని రోధక: అజ్జాన గ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయ: 

 

''గు'' అంటే అంధకారం, ''రు'' అంటే తొలగించడం అని అర్థం. అజ్ఝానమనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదు.  గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు అద్వితీయమైన గురు పరంపరలకు అలవాలం మన భారతదేశం. గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కష్టమైన సంస్కతి మనది.
 

ఆది యోగి, ఆది గురువైన మహా శివుడు ఆషాఢ పౌర్ణిమినాడు సప్తర్షులకు జ్ఝానబోధ చేశాడని శివపురాణంచెబుతున్నది. ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఝాన బోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది. వ్యాస మహాముని ఈ రోజున సత్యవతీ పరాశరులకు జన్మించాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను బుక్, యజుస్, సామ, అధర్వణ వేదాలుగా విభజించాడనీ ప్రతీతి. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతంతో పాటు అష్టాదశపురాణాలు రచించాడు వ్యాసుడు. వ్యాసుడు సప్తచిరంజీవులలో ఒకడు.ఈ పుణ్య విశేషాలను పురుస్కరించుకుని ఆషాడ పౌర్ణమి నాడు గురుపూర్ణిమగా, వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము. గురు పూర్ణిమను పురస్కరించుకుని గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది.

ఆషాఢ పూర్ణిమ నాడు గురు పౌర్ణమి సందర్భం గా గురుమండల ప్రతిష్ట, వ్యాస మూర్తి పూజ జరుగుతున్నాయి.

 

దేవీ భాగవతము నందలి 7 వ స్కంధం నందు శతాక్షి అను అమ్మవారి కధ  కలదు.  రురు అను అసురుని పుత్రుడు దుర్గముని కారణంగా భూలోకంలో వేదములు లుప్తమయ్యాయి  యజ్ఞములు ఆగి పోయి దేవతలుదుర్బలులు అయ్యారు.  అందువల్ల నూరు సంవత్సరములు వర్షములు పడలేదు ప్రాణి కోటి అల్లకల్లోలం చెందింది. దుర్గముడు సృష్టించిన కాటక సమయము లోన  అమ్మవారు తమ దేహమున శాకములు ఫలింపచేసి భక్తులైన మానవులందరిని రక్షించెను.  వర్షములు కురియనంతవరకు అమ్మవారి శరీరం నందు పుట్టినట్టివియును ప్రాణులను రక్షిణించునట్టివియును ఐన శాకములు చేత  (ఆహారపదార్థముల చేత) అమ్మవారు సకల విశ్వమును కాపాడుచుండెను , శాకములు భరించుటచేత అమ్మవారు "శాకంభరి" గా  లోకమున ప్రసిద్ధి గాంచినది, ఆషాఢ మాసం లో ఒక రోజు (కామాక్షీ) అమ్మవారిని "శాకంభరి" గా వివిధములైన శాకములతో అలంకరించి కొలుచుకొనే ఆచారం కలదు.

 

భాద్రపద శుద్ధ చవితి నుండి గణపతి నవరాత్రి ఉత్సవాలు- ప్రతీ రోజు ఉదయం మూల మూర్తికి అభిషేకం వార్షిక మూర్తికి ప్రాతఃకాల పూజ, ప్రదోష కాల గణేశ  సహస్ర నామార్చన, వినాయక చవితి నాడు లక్ష్మి గణపతి హోమము జరుపబడుతున్నాయి.  ప్రతీ సంవత్సరం పర్యావరణ సంరక్షణలో భాగం గా ఒక్క మృణ్మయము తో చేసిన  వినాయక మూర్తి ని మాత్రమే వార్షిక మూర్తి గా ప్రతిష్టించడం జరుగుతోంది. పదవ రోజు స్వామి వారి ఊరెరిగింపు, అన్నసంతర్పణ, నిమజ్జన కార్యక్రమాలు.

 

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రద్ధగా జరుపబడుతున్నాయి. పాడ్యమి మొదలు దశమి వరకు శ్రీ కామాక్షీ అమ్మవారికి - శ్రీ స్వర్ణ కవచాలంకార దుర్గా దేవి, శ్రీ బాలాత్రిపురసుందరి, శ్రీ గాయత్రీ  దేవి, శ్రీ అన్నపూర్ణా దేవి ,  శ్రీ లలితా త్రిపురసుందరీ  దేవి, శ్రీ మహాలక్ష్మీ దేవి, శ్రీ సరస్వతీ  దేవి (మూల నక్షత్రమున ) , శ్రీ దుర్గా దేవి, శ్రీ మహిషాసురమర్ధినీ  దేవి , శ్రీ రాజరాజేశ్వరీ దేవి గా అలంకారములు జరుప బడుతున్నాయి.  ప్రతీ రోజు అమ్మవారికి  అభిషేకం, ఆ అవతారం నకు  సంబందించిన అలంకారం, వివిధ స్తోత్ర పారాయణాలు, చండీ సప్తశతీ పారాయణము, చండీ పాఠ పారాయణం, భజనలు, దశమి నాడు చండీ హోమం, శమీ వృక్ష పూజ జరుపబడుతున్నాయి.  మూల నక్షత్రమున, శ్రీ సరస్వతీ  దేవి కి పిల్లలు, పెద్దలతో పుస్తక పూజ జరుపబడుతున్నాయి. ప్రతీ రోజు ప్రసాద వితరణ.

Devi Navaraatrulu 2018

1/50

Devi Navaraatrulu 2019

 

ఇక కార్తీకమాసం అంతా ఆలయంలో ఎన్నో ప్రత్యేక పూజలు, భక్తజన సందోహం తో ఆలయ ప్రాంగణం అంతా కిలకిలా లాడుతుంటుంది. కార్తీక మాసం  నెలంతా ప్రతీ రోజు ఉ: 5:30 ని: లకు శ్రీ ఏకామ్రేశ్వరస్వామి వారికి  మహాన్యాస పూర్వక ఏకవార/ఏకాదశ రుద్రాభికం. ప్రతీ రోజు సాయంత్రం ఆకాశదీప ప్రజ్వలన, ప్రతీ సోమవారం  మరియూ ఇతర పర్వదినములందు - శు: ఏకాదశి, మాసశివరాత్రి, త్రయోదశి, పౌర్ణమి,  త: దినములలో సాయంత్రం ప్రత్యేక హారతులు , ఏకాదశినాడు సాయంత్రం సహస్ర జ్యోతిర్లింగార్చన, పౌర్ణమి నాడు జ్వాలాతోరణ మహోత్సవం. మాసశివరాత్రి  నాడు సహస్ర బిల్వాపత్రార్చన. 

Kaartheeka Maasa Utsavaalu 2018

1/98

Kaartheeka Maasa Utsavaalu 2019

 

మహాశివరాత్రి మాహా పుణ్య దినం నాడు విశేష అభిషేకములు, పంచకాటక పారాయణములతో అన్నాభిషేకం, లింగోద్భవకాల అభిషేకములు, అభిషేకాన్నం తో ప్రసాద వితరణ, జరుగుతున్నాయి.

1/8

MahaaSivaraatri 2020

 

ఫాల్గుణ శుద్ధ అష్టమి నుండి నవమి వరకు స్వామి వారి అమ్మవారి వార్షిక మహోత్సవాలు. త్రిదివస ఉత్సవాల్లో భాగంగా  ప్రతీ రోజు ప్రత్యేక అభిషేకాలు, పూజలు, హోమాలు, నవమి నాడు స్వామి వారి అమ్మవారి ఊరెరిగింపు, శాంతి కళ్యాణం, ఉయ్యాలసేవ, పుష్పోవత్సం, అన్న సంతర్పణ జరుగుతున్నాయి.

2nd Anniversary 2019

1/68

3rd Anniversary 2020

సామాజిక బాధ్యతగా హిందూ ధర్మ రక్షణ పరిరక్షణార్ధం, యువత ఆధ్యాత్మిక అభివృద్ధికి, మానసిక అభివృద్ధి కి ఉపయోగపడే విధంగా వేసవి సెలవుల్లో పిల్లలకు వివిధ శ్లోకాలు - ఆదిత్య హృదయం, భగవద్గీత, విష్ణు సహస్ర నామ స్తోత్రం, ప్రాధమిక పూజ విధానం, వ్యక్తిత్వ వికాసం, భావ వ్యక్తీకరణ మొదలైన విషయాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. ఈ కార్యక్రమము లో సుమారు 50-60 మంది స్థానిక బాల బాలికలు అత్యుత్సాహంతో పాల్గొంటారు. పిల్లలతో పాటు ముఖ్యంగా తల్లులు (కొంతమంది తండ్రులు) కూడా శిక్షణ సమయం లో పాల్గొని ఇంటికి వెళ్లిన తరువాత తీరిక సమయాల్లో చెప్పిన  స్తోత్రాలు/ శ్లోకాలు పిల్లలతో వల్లె వేయిస్తూఉంటారు. వేసవి తరగతుల శిక్షణ అయినా తరువాత పాల్గొన్న వారందరికీ జ్ఞాపికలు,  ఉన్నత ప్రతిభ కనబర్చినవారికి ప్రత్యేక నగదు బహుమతులు బహుకరించడం జరుగుతోంది.